20. మౌక్తికము

20. మౌక్తికము

    ''ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.''

                                        - (యోహాను 1:1.)

ఆది:

    ఆదియనగా సృష్టికి ఆరంభము. అంతకు ముందు సృష్టే లేదు. ఆది యందు వాక్యముండెను. వాక్యమనగా శబ్దము. వాక్యమందు శబ్దము మొదట అవ్యక్తముగా నుండి తరువాత సృష్టిగా వెలువడెను. అవ్యక్తము అనాహత శబ్దము.  ఇందు సృష్టి వెలువడుటకు అవసరమైన మూడు గుణములు సమముగా ఉండెను. ఆ మూడు గుణములు సామ్యముగా, సమతూకముగా ఉన్నప్పుడే సృష్టికి ఆది. ఆ మూడు గుణముల మిశ్రమ విజృంభణ వలన సృష్టి కొనసాగుచున్నది.ఈ స్థితియే దేవుని మహిమ పరచుట. ఈ మహత్తే దేవుని సత్తా. కనుక వాక్యము దేవుడగుట జరిగెను. అనగా ఆయన (మహత్తు) ''ఆది యందు దేవుని వద్ద ఉండెను.'' ( వాక్య రూపముగా దేవుని వద్ద ఉండెను.) - (యోహాను 1:2).

    దేవుని నుండి సృష్టి ఆవిర్భవించెను.  ''సమస్తమును ఆయన మూలముగా కలిగెను.'' - (యోహాను 1:2). ఈ దేవుడు మూడు గుణముల మిశ్రమముతో సృష్టిని ఏర్పరచెను.

వాక్యము:   

    ఆది యందు సృష్టి కలుగుటకును, తదుపరి సృష్టి కొనసాగుటకును వాక్యమే ఆధారము. వాక్యము సృష్టికి పూర్వము దేవుని వద్ద ఉండెను. కనుక దేవుడు  సృష్టి ఉన్నను, లేకున్నను కలడు. దేవుడు ఉన్నాడు అను ఈ స్థితి ఎప్పుడును ఉన్నది. ఇది చలించదు. కాని చలింప జేయు శక్తి మంతము. ఇది అదృశ్యము. ఇట్టి స్థితి యందు ప్రకృతికి మూలరూపమైన వాక్యమందలి వ్యాపక శక్తి వెలివడుటకు యత్నించెను. కదలిక లేని దేవుడు అట్లే ఉండగా వ్యాపక శక్తిచే వాక్యము కలిగెను. కాని వాక్యము సమీకరించబడిన కర్షణతో  దేవుని సత్తా మూలముగా ఉండెను. అందు వలన వాక్యము ప్రకృతిగా సృష్టిగా వ్యక్తమగుటకు కారణమాయెను. మూలముగా నున్న దేవుని పురుషుడందురు. ఈ ప్రకృతి పురుషుల స్థితియే సృష్టికి ప్రథమ రూపమాయెను. ఇట్లు అవ్యక్తము నుండియే మహత్తు వాక్యముగా సృష్టి కలిగెను. ఈ మహత్తు వాక్యము కంటే వేరు కాదు. అయినను మహత్తే వ్యక్త సృష్టికి ఆది ఆయ్యెను. నుక సత్తాగా నున్న దేవుడైన పురుషుడు శక్తిగా వ్యక్తమైన ప్రకృతికి ఆధారమాయెను. కనుక ఆధారమైన వాడు దేవుడు. ఆధేయమైన మహత్తే , (వాక్యమే) దైవ సృష్టి అయ్యెను.

సృష్టి :-

    మొదట దేవుడు ప్రకాశవంతుడు. ఆయన  అనాహత శబ్దముగా వాక్యమాయెను. వాక్యమునందు ఆకర్షణ అను ప్రకృతి కలిసెను. ఈ మూడింటి కలయికయే మాయ. ఇట్టి స్థితియందు దేవుని ప్రకాశము ప్రతిఫలించెను. మాయ రెండు విధములు అయ్యెను. (1) శుద్ధ సత్వ మాయ

(2) మలిన సత్వ మాయ. దేవుని ప్రకాశము శుద్ధ సత్వ మాయపై  పడి ప్రతి ఫలించగా ఈశ్వర స్థితి (ఆత్మ, బ్రహ్మ , యేసు, ప్రభువు) ఉద్భవించెను. ఇట్టి విశ్వ శక్తి  సృష్టి, పోషణ(రక్షణ), లయములకు అధిపతి. మలిన సత్వ మాయ యందు ప్రతిఫలించిన దేవుని  ప్రకాశము జీవులుగా యేర్పడెను. ఈ     మలిన సత్వమనగా, సత్వ గుణము, రజోతమో గుణములతో మిశ్రమమై మలిన మగుట. తమోగుణ లక్షణ మేమనగా అజ్ఞానము, అవిద్యలచే తనకు మూలమైన దేవుని దర్శింప లేకుండుట. రజో గుణ లక్షణమేమనగా త్రిగుణముల వలన కలిగిన సృష్టిలో సృష్టికర్తకు బదులుగా భ్రాంతిచే సృష్టిని, సఙృష్టియందు వ్యక్తముగా నున్న పదార్ధములనే అనుభవించుట మరియు భ్రమచే విషయములందాసక్తితో  సుఖ దు:ఖములకు లోనగుట. దీనిని అజ్ఞానమందురు. ఈ అజ్ఞానమే సాతాను సంబంధము.

    ఈ విధముగా దేవునిచే మహత్తు వలన మూడు గుణములలో ఒక్కటైన సత్వగుణము యొక్క అంశ ఈశ్వరుడుగాను, రెండవదైన రజస్సు యొక్క అంశ జీవుడుగాను యేర్పడెను. ఇక మూడవదైన తమస్సు యొక్క అంశవలన జగత్తు యేర్పడెను.

    జగత్తు ఏర్పడుటకు ముందుగా విశ్వశక్తి అయిన  మహత్తునుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఆవిర్భవించెను. ఈ తన్మాత్రలు పంచీకరణము చెందగా పంచ భూతములాయెను. పంచ భూతములనగా ఆకాశము, వాయువు , అగ్ని, జలము, పృథ్వి. ఇవి ఎట్లు యేర్పడినవనగా శబ్ద తన్మాత్ర నుండి సూక్మ్ష ఆకాశము కలిగెను. శబ్ద, స్పర్శ తన్మాత్రల వలన సూక్ష్మ వాయువు కలిగెను. శబ్ద, స్పర్శ,రూప  తన్మాత్రలవలన సూక్ష్మ అగ్ని కలిగెను.     శబ్ద, స్పర్శ,రూప, రస  తన్మాత్రల వలన సూక్ష్మ జలము కలిగెను. శబ్ద, స్పర్శ,రూప, రస, గంధ  తన్మాత్రల వలన సూక్ష్మ పృథ్వి పుట్టెను.    

    ఈ సూక్ష్త ఆకాశము రెండు అర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక వాయువుతోను, రెండవ పరక అగ్ని తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను.

    సూక్ష్మ వాయువు రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక అగ్ని తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను.   

    సూక్ష్మ అగ్ని రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను.

    సూక్ష్మ జలము రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక అగ్నితోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను.

    సూక్ష్మ పృథ్వి రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక అగ్నితోను, నాల్గవ పరక జలము తోను కలిసెను.

    ఈ విధముగా ఆకాశము యొక్క ఒక అర్ధ భాగము తన రెండవ అర్ధ భాగములో మిగిలిన నాలుగు భూతముల యొక్క పరకలతో కలిసి ఆకాశ భూతమయ్యెను. అట్లే వాయు భూతము, అగ్ని భూతము, జల భూతము, పృథ్వీ భూతములయ్యెను. దీనినే పంచీకరణ అందురు. ఇట్లు సృష్టి అయ్యెను.

    ఇంను  తామసాంశమందు సత్వగుణము వలన అంతరింద్రియములైన జీవుడు (జ్ఞాత)యు, మనస్సు, బుద్ధి, చిత్తము అను అంత:కరణ చతుష్టయమును మరియు వినుట, స్ప్రృశించుట, చూచుట, రుచి వాసనలను ఎరుగుటకు సాధనములైన పంచ జ్ఞానేంద్రియములును కలిగెను.అటులనే తామసాంశ యందు రజోగుణము వలన పంచ ప్రాణములైన సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణ వాయువు, అపాన వాయువు కలిగెను మరియు వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అను పంచ కర్మేంద్రియములు కలిగెను. 

    తామసాంశములో తమోగుణము పైన చెప్పిన పంచీకరణ వలన పంచ భూతములై మానవుని శరీరము కూడా ఆ పంచ భూతముల చేతనే ఏర్పడెను. అయితే పంచ భూతముల రూపములు ఈ దేహ మందు రక్తము, మాంసము, చర్మము, రసము, ఎముకలు, మూలిగ, మెదడుగా కనబడుచున్నవి.

    ఈ విధముగా జగత్తున్ను , మానవుని దేహమున్ను, ఇంద్రియములును ఏర్పడెను.

    ఇట్టి సృష్టిని మహత్తు వాక్యము ద్వారా ఆరు దినములలో క్రమముగా చేసి, తాను చేసిన సృష్టినిచూచి బాగున్నదని ఊరకుండెను. ఆమెన్‌! ఏడవ రోజున విశ్రాంతి నొందెను.

    దేవుని సత్తా వలన సర్వము పై విధముగా కలిగెను. అనగా ''సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండ కలుగ లేదు.'' - (యోహాను 1:13).

ఆదాము, అవ్వ:

     వాక్యముగా నున్న ఆత్మయే పరిణామము చెందినది గావున, ఆ ఆత్మ సర్వ వ్యాపకము. సర్వమునకు ఆత్మ ఆధారమై ఉన్నది. దేవుని సత్తాయే ఆత్మ చైతన్యము. ఆత్మ అను చైతన్యముండుట వలన ఇంద్రియములు చేతనములై ఇంద్రియ వ్యాపారము చేయు చున్నవి. దేహము జడము కావున నశించు చున్నది. ఆత్మ నశించుట లేదు.

    ఇట్టి జడ, చైతన్యముల కలయికతో ఏర్పడినదే జీవుడనెడి చేతనత్వము. పరిణామ క్రమమున  తొలి మానవుడు ఆదాముగా సృజించ బడెను. ఆదాము నందలి చైతన్యము దేవుని ఆత్మయే. అందు వలన ఆదాము శరీరానుసారముగా కాక, దేవుని పోలి ఉన్నవాడయ్యెను.  దేవుడు మానవుని సృజించినప్పుడు వానిని పరిపూర్ణునిగా, తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసెను. ''దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను''(ఆది 1:27). ఈ ఆదాము చైతన్య రూపమైన వాడుగా ప్రకాశవంతమైన వాడుగ నుండి దేవుని సత్తాను నిరంతరము ఎరిగియే ఉండెను.

    ఆదాము అను పురుషుని నుండి ప్రకృతి కార్య రూప సంబంధముగా స్త్రీ రూపముగా, అవ్వగా సృజించ బడెను. వీరిద్దరును తమలో తాము ఆత్మగానే యుండిరి. అందు వలన దేవుని కిష్టులైరి.

    ఆదాము, అవ్వలు సృజించ బడిన విధముగానే జీవ పరిణామ నిమిత్తమై సాతాను కూడా సృజించ బడెను. సాతాను అనగా నేను జీవుడను అను అజ్ఞానము. ఈ అజ్ఞానము ముందుగా అవ్వను ఆకర్షణ , మోహము అను వాటిచే ప్రభావితము చేసెను. ఎందుకనగా అవ్వ ప్రకృతి స్వరూపము, కార్య రూపము. అవ్వ మూలముగా ఆదాము ప్రేరేపించ బడెను. సాతానుకు ఇద్దరును లోబడిరి.  అజ్ఞాన మూలము తమో గుణము. కావున ఆకర్షణ, మోహముల భ్రమచే దేవుని మరచిరి. రజో గుణము వలన దేవునిచే  సృష్టించ బడిన వాటిని అనుభవించుట మొదలిడిరి. ''దేవుని సత్యమును,  అసత్యమునకు మార్చి, సృష్టి కర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.'' - (రోమా 1:25) . ఈ అనుభవమునకు లోనై దురాశ వలన అజ్ఞాన పూర్వక జీవితమనెడి పాపము చేసిరి. ఇట్టి దేహాభిమానము అనెడి పాపము వలన వారి దేహములు మరణమునకు తీర్పు తీర్చ బడెను. వారి సంయోజన క్రియల మూలముగా ఆదాము సంతానము వృద్ధి పొందెను. ఆదాము, అవ్వలు దేవుని ఆజ్ఞను సాతాను మూలముగా అతిక్రమించి నందున, ఆదాము సంతానము కూడా అజ్ఞానులైరి మరియు శరీరానుసార క్రియలు జరుపుకొనుచు, వారి వారి మంచి పనులకు సుఖమును, చెడ్డ పనులకు దు:ఖమును పొందుచు, మరణించు చున్నారు. దైవమును మరచి యున్నందున వీరందరును సుఖ దు:ఖముల ననుభవించుచు, మరణించుచు అజ్ఞానమును వీడరైతిరి. ఎందు కనగా వారు తమ మనస్సులో దైవమునకు చోటియ్యక పోయిరి, గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అజ్ఞానముతో ఉండిరి అనగా వారు చీకటిగా ఉండిరి. దేవుడు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చుండెను. కాని చీకటి దానిని గ్రహింప కుండెను. ఈ విధముగా మానవులు చీకటిగా నుండి దేవుని ఆత్మచే ప్రకాశించ బడుచున్నారు. కాని వారు తమను ప్రకాశింపజేయు వెలుగును గుర్తింప కున్నారు. కారణమేమనగా భ్రమ వలన కలిగిన  భ్రష్ట మనస్సు మూలముగా వారి మంచి చెడు క్రియలకు తగిన ఫలితమును సుఖ దు:ఖ రూపములో వారి శరీరముతో అనుభవించుచున్నారు. అట్టి అనుభవము శరీరానుసారమై నందున వారి ఇంద్రియములను ప్రకాశింపజేయు దేవుని వెలుగును యెరుగకున్నారు. వారి శరీర తాదాత్య్మత మూలమున వారిని నడిపించుచున్న దేవుని ఆత్మను గుర్తెరుగక, మరచి యున్నారు.

అజ్ఞానులు :-

     ఆదాము మొదటి వాడు. అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించెను. ఒక మనుష్యుని ద్వారా అజ్ఞానము(పాపమును), అజ్ఞానము ద్వారా మరణమును లోకములో  ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిన్నీ సంప్రాప్తమయ్యెను.  మనుష్యులు అజ్ఞానులై యుండిరి. వారు ఆత్మ కలిగి యుండియు, దాని నెరుగనైరి. ఆత్మయే మనుష్యునికి ఆధారమై ఉన్నది. మనుష్యునిలో అది ఆంతర్య పురుషునిగా ఉన్నది. కనుక ఆత్మయే మనుష్యుని నడిపించుచున్నది. లోపల నున్న ఆంతర్య పురుషుడు మేలు చేయవలెనని కోరు చున్నాడు. కాని బాహ్య పురుషుడైన శరీంరేంద్రియములు, ఆంతర్య పురుషుని ప్రేరణను వినక, చేయవలసిన మేలు చేయకున్నాడు. చేయ కూడని కీడు వద్దని ప్రేరణ కలిగినను, కీడునే చేయుచున్నాడు. శరీరానుసారులు ఈ విధముగా బాహ్య పురుషునిగానే పని చేయుచున్నారు. ఈ ప్రపంచ మందు గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయములను యితర పదార్ధముల ద్వారాను, ఇతరుల ద్వారాను, ఈ బాహ్యమును పురుషుడు అనుభవించుచున్నాడు. వాటిపై దురాశను పెంచుకొని స్వార్ధ పరుడైనాడు. ఈ స్వార్ధము వలన ఎప్పుడును తన సుఖము కొరకును, దు:ఖ నివారణ కొరకును నిరంతరము శ్రమ పడుచుండును. ఈ శ్రమతో తన కోరికలను తీర్చుకొనుటకు ప్రయాస పడుచు వేదన పడుచుండును. ఫలితముగా సుఖమును గాని, దు:ఖమును గాని పొందును. తాను చేయు ప్రయత్నములు ఫలించుట కొరకు తపన పడుచూ మరియు ఆ పనులు జరుగుచున్నప్పుడు కలగిన  ఫలితములచే ప్రేరణ పొందుచు పనులు చేయు చుండును.

    కాని దేవుని ఉగ్రత దినమందు, మనుష్యుడు చేయు పనులను బట్టి మంచి గాని, చెడు గాని  ఫలితములనిచ్చుచు, మరణమునకు  ఆ దైవము తీర్పు నిచ్చును. ఈ విధముగా మనుష్యుడు జరుపు క్రియలను, అతని సుఖ దు:ఖముల  అనుభవములను మరియు మరణమును,  అతని యొక్క అజ్ఞానమై ఉన్నవి. ఈ అజ్ఞానులైన మనుష్యులే ఆదాము సంతానము.

ధర్మశాస్త్రము:-

    ధర్మశాస్త్రమనగా మంచి చెడు పనుల గురించియు, వాటి ఫలితముల గురించియు తెలుపునది.  ఈ ధర్మశాస్త్రమును ఆత్మానుసారముగా ఎరుగక అజ్ఞానులైన నరులు మరణమునకు తీర్పు తీర్చ బడుచున్నారు.  ఈ ధర్మశాస్త్రమును అమలు పరచు అధికారము తండ్రియైన యెహోవా తన కుమారుడైన యేసు క్రీస్తునకు అప్పగించెను. మానవులు అజ్ఞానము నుండి విడుదల పొందవలెనని యెహోవా ప్రేమతో ధర్మశాస్త్రమును నియమించెను. తాను అనుభవించు వానిపై తృప్తి కలిగినను, వైరాగ్యము కలిగినను లేక భరించ నలవిగాని దు:ఖమును పొందినను, తనకు కలిగిన గుణ పాఠము ద్వారా తన అజ్ఞానమును విడచును. కనుక ధర్మశాస్త్రము తన అజ్ఞానమును బయలు పరచును. దీనిని తెలిసిన నరులు శరీరానుసారముగా కాక, ఆత్మానుసారముగా జీవించి జ్ఞానమును పొందగలరు మరియు మరణమును తప్పించు కొందురు. కాని ఎక్కువ మంది నరులు ధర్మశాస్త్రమును ఆత్మానుసారముగా నెరుగరు.

తీర్పు :-

     అయినను కొందరు ధర్మశాస్త్రము నెరిగియు, వారి పాపేచ్ఛ వలన, శరీరమే సత్యమని భ్రమింతురు. అందు వలన, యింకను స్వార్ధము వలన దురాశకు లోబడుదురు. ఈ దురాశ కారణమున నరులు తమ్ము తాము కాముకత్వమునకు అప్పగించు కొనుచున్నారు. కాని ధర్మశాస్త్రము వలన వారు చేయు మంచి పనులకు మంచి ఫలితమును (సుఖము) చెడు పనులకు చెడు ఫలితమును (దు:ఖము)  అనుభవించుటకు క్రీస్తు న్యాయ దినమందు వారికి తీర్పు తీర్చ బడుచున్నది. ఈ తీర్పు వలన వారికి ఈ శరీరము ఏర్పడుచున్నది. ఈ శరీర అభిమానమే అజ్ఞాన మూలము. ఇట్టి శరీరమునకు మరణము తప్పదు. కన తీర్పునకు  లోబడినచో అది మరణమును ఇచ్చును. తీర్పును తప్పించునది జ్ఞానమే. జ్ఞానమనగా దేవుని ఎరుగుట. అజ్ఞానమనగా శరీరేచ్ఛ, పాపేచ్ఛల మూలమున శరీరానుసారము జీవించుట. శరీరానుసారులు తీర్పును తప్పించుకొన జాలరు.

ప్రవక్తలు:-

    శరీరానుసారులైన వారందరును జ్ఞానము పొంద వలెననిన, వారికి మొదట దేవునిపై విశ్వాసము కలుగ వలెను. దేవుని ఋజువు పరచుటకు సాక్షియు, దేవుని చేరుటకు మార్గమును కావలసి వచ్చెను. భ్ర్రష్టులైన మనుష్యులను వారి పాపము నుండి రక్షించుటకు, దేవుని వద్ద నుండి అనేక ప్రవక్తలు పంప బడిరి. వీరు దైవ జనులు. మనుష్యులను పాపము నుండి విమోచన నొందించుటకు, ఈ ప్రవక్తలు దేవుని గూర్చియు, జ్ఞానమును గూర్చియు ప్రబోధించు చుండిరి.

ప్రబోధ (దేవుడు) :-

    యెహోవాయే దేవుడు. అద్వితీయ దేవుడు (కీర్తన 86:8), లోకమును, పరిపూర్ణతను సృష్టించెను (కీర్తన 89:11). మనుష్యుని నివాస స్థలము దేవుడే (కీర్తన 90:1). యుగయుగములకు యెహోవాయే దేవుడు (కీర్తన 90:2). దేవుడే అందరికి ఆశ్రయము (కీర్తన 91:9). సదాకాలము ఉన్నవాడు దేవుడే (కీర్తన 93:2).



ప్రబోధ (జ్ఞానము) :-

    ''నా (దేవుని) మాటలన్నియు నీతి కలవి (దేవుని నీతి). అవి అన్నియు అవివేకికి తేటగాను, తెలివి నొందిన వానికి యదార్ధముగాను నున్నవి ''(సామెత 8:8-9). ''నీతి మరణము నుండి రక్షించును. యదార్ధవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము'' (సామెత 11:4,5,30). ''నీతిమంతుల వెలుగు తేజరిల్లును'' (సామెత 13:9). ''నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' (సామెత 4:18). ''నీతిని అనుసరించు వానిని దేవుడు ప్రేమించును '' (సామెత 15:9). ''నీతి మార్గము నందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు'' (సామెత 12:28). సత్యవాదులు నీతిగల మాటలు పలుకుదురు (సామెత 12:17). ''నీతిమంతులు ఆశించినది వారికి దొరకును. నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును'' (సామెత 10:24,28,31).

    నీతిమంతులు జ్ఞానమును కలిగి యుందురు. దేవుని మాటలు విని, అంగీకరించి, ఆజ్ఞలను విని అంగీకరించి, దాచుకొను వారు ధన్యులు. యెహోవా జ్ఞానమును గూర్చి యీలాగు చెప్పెను. '' నా కుమారుడా, నీవు నామాటల నంగీకరించి, నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనుము. జ్ఞానమునకు నీ చెవినొగ్గి హృదయ పూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నీతి మంతుల ప్రవర్తనలను అనుసరించుచుందువు'' (సామెత 21:5,19,20). ''దయను సత్యమును ఎన్నడును నిన్ను విడచి పోనీయకుము. స్వబుద్ధిని ఆధారముగా చేసికొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము'' (సామెత 3:3-5). జ్ఞానమును విడువక  ఉండిన అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన యెడల అదినిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించు కొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.

    ఈ విధముగా పాతనిబంధన కాలమందున్న జనులకు దైవజనులైన ప్రవక్తలు సందేశము లిచ్చు చుండిరి. కాని ఇవన్నియు భక్తి, విశ్వాసములను పెంచునవే కాని, వారికి జ్ఞానోదయము కలుగుట లేదు. అందువలన దైవమైన యెహావా మరేదైనా ప్రణాళికను ఏర్పరచ వలసి వచ్చినది. ఇంకను దైవము వైపు మరలని పాపులు, అన్యజనులు మిక్కిలిగా నుండిరి. అద్వితీయుడైన యెహోవా ఒక్కడే దేవుడని విశ్వసించక అన్యదేవతల విగ్రహములను ఆరాధించు చుండిరి. అజ్ఞానమును కొంతయైనను బాపుటకు యెహోవా తన ఆజ్ఞలను మోషె ద్వారా ఈ విధముగా ప్రకటించెను  (నిర్గమకాండ 20:1-17).

దేవుని ఆజ్ఞలు :-

1.నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీతండ్రిని , తల్లిని సన్మానించుము.

2.నర హత్య చేయకూడదు.

3.వ్యభిచరించ కూడదు.

4.దొంగిల కూడదు.

5.నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు.

6. నీ పొరుగు వాని యిల్లు ఆశింపకూడదు.

7. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, దాసుడనైనను, అతని యెద్దునైనను, అతిని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు.

8. దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని(శరీరావయవములకును పాపమునకును దాసుడైన శరీరానుసారుడే ఐగుప్తదేశము).

9.నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

10. యే యితర రూపముల విగ్రహారాధన చేయక నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడునై యున్నాను.

యేసు క్రీస్తు - యోహాను:

    ''యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను.'' (మత్తయి 11:13). ప్రాచీన కాలము అనగా ''యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలును ఉండిరి, అప్పుటి నుండి దేవుని రాజ్యసువార్త ప్రకటించ బడుచున్నది.'' (లూకా 16:16).

    అయినను ఈ కాలమంతయు అజ్ఞాన కాలమయ్యెను. మనుష్యులు వారి ప్రాచీన స్వభావమును వీడి జ్ఞానము నొందకుండిరి. అందువలన యెహోవా అన్యజనులైనను, అవిశ్వాసులైనను, విశ్వాసులైనను అందరికిని దేవుని వాక్యము అందునట్లు యోచించెను. తనకు ప్రతినిధిగా దైవ కుమారుడైన యేసు క్రీస్తు అను నరుని పంపెను. ఇతను తన వలెనె సత్య స్వరూపమై ఉండెను. జ్ఞానమును పొందుటకు అచంచల మార్గమును బోధించుటకు తన జీవితమునే మార్గముగా చూపెను. నరుడు దేవుడగుటకు ప్రేమ మార్గమును చూపెను. యెహోవా దేవునిగాను, తండ్రిగాను ఉండి కుమారునికి సర్వాధికారమిచ్చెను. తండ్రి అదృశ్యుడు, దైవకుమారుడు నరుని వలె గోచరించును. ఈ కుమారుడు దైవాంశ సంభూతుడగుటచే సత్యమును నిత్యజీవమును అయి ఉన్నాడు మరియు వెలుగై ఉన్నాడు.

    నరుని రూపములో నున్న  దైవమే యీ కుమారుడు. ఇతడే యేసు క్రీస్తు. అదృశ్యుడైన తండ్రి కార్యమును నెరవేర్చుటకు ఈ యేసు ప్రభువు అను నరుని మార్గముగా చేసెను. అయినను ఈ అజ్ఞానులైన మనుష్యులు వారి వంటి మనుష్యుడే అని భావించ వచ్చును కనుక, తండ్రియైన యెహోవా తన కుమారుని గురించి సాక్ష్యమిచ్చుటకు యోహాను అను మరొక నరుని ముందుగా పంపెను. ఆ నరుడు అందరి వంటి వాడు కాడు. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.

    చైతన్య స్వరూపుడైన దేవుని మూలముగా వచ్చిన యోహాను  అను జ్ఞాని, అజ్ఞానులైన మనుష్యులందరు నమ్మునట్లుగా ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. వెలుగే జ్ఞానమైనందున, నరులకు జ్ఞానము కలిగించగల దైవ కుమారుని గురించి  సాక్ష్యమిచ్చుటకు  వచ్చెను. ఈ యోహాను కూడా దేవుని చైతన్యమును కలిగి ఉన్నందున అతడు అనుభవించుచున్న దానినే సాక్ష్యమిచ్చెను. వెలుగై ఉండలేదు కాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఎందుకనగా వెలుగు దైవము యొక్క లక్షణము. కాని దైవము అదృశ్యము. అందు వలన యోహాను వెలుగై ఉండలేదు కాని ఆ వెలుగును అనుభవించుచున్న  జ్ఞాని గాను, సాక్షిగాను రావలసి వచ్చెను.

    యేసుక్రీస్తునకును వాక్యమునకును భేదము లేదు. ఆ వాక్యమే శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దీనినే యోహాను తెలియజేయుచున్నాడు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు గనుక ముందటివాడాయెనని ఎలుగెత్తి చెప్పెను. వాక్యమెప్పుడును సర్వకాలములయందు ఉండును గాన,  వాక్యమే యేసైనందున, ఆ యేసు శరీరధారిగా వెనుక వచ్చుచున్నను, దేవుని ఆత్మగా సనాతన పురుషుడై ఉన్నాడు. అందువలన ఆయన కంటె ప్రముఖులు లేరు. ఆయన నిత్యుడు, సర్వోన్నతుడు, సత్య స్వరూపుడు.

    దేవుని, ఈ ఆత్మను తెలిసికొనుటయే జ్ఞానము. అజ్ఞానులు దేవుని ఆత్మను ఎరుగరు. అందుకే ఒక అనుభవ జ్ఞానియైన యోహాను వంటి సద్గురువు యొక్క సాక్ష్యము కావలసి వచ్చెను. ప్రవక్తలను పూర్వము జనులు కొంత వరకు నమ్ము చున్నందున, యోహాను అను ప్రవక్తను  దేవుడు ఈ కార్యమునకు వినియోగించెను. అందు వలన యోహాను దైవ కుమారునికి సాక్ష్యమిచ్చెను.  యేసుకు బాప్తిస్మము ఇచ్చుట ద్వారా అందరికి తెలియ పరచెను.

బాప్తిస్మము :-

    బాప్తిస్మము అనగా నూతన జన్మ. శరీరానుసారులైన వారు, తాను ఆత్మనే యని భావించుచు, శరీర సంబంధ క్రియలను చేయుటలో దుష్క్రియలు జరుపక  సత్క్రియలనే జరుపుటను ఆత్మానుసార జీవనమందురు. ఈ ఆత్మానుసార జీవనము గడుపుటకు మనుష్యులకు దేవుని ఆజ్ఞానుసారులైన వారికి బోధ, పరిచర్యల ద్వారా ప్రవక్తలచే బాప్తిస్మము ఇచ్చుట సంప్రదాయము. బాప్తిస్మము పొందిన వారు పవిత్రజీవనము జరపుచు చివరకు పవిత్రులు గావలెను. ఈ పవిత్రతనొందిన పూర్ణ స్థితి యేసు క్రీస్తు స్థితి. కాని దైవ కుమారుడు ఇట్టి పూర్ణమైన స్థితిలోనే జన్మించెను. అందువలన ఆయనకు బాప్తిస్మము ఇవ్వవలసిన అవసరమే లేదు. అజ్ఞానము వలన, తల్లితండ్రుల వలన జన్మించిన వారు అపవిత్రులు.  వీరికే బాప్తిస్మము ద్వారా నూతన జన్మ అవసరము. క్రీస్తు ఒక కన్యక గర్భము నుండి జన్మించిన తేజో రూపము. ఈయన పాపేచ్ఛ వలన జన్మించ లేదు, మరియు మంచి చెడుల ఫలితములను అనుభవించుటకు పుట్టలేదు. మనుష్యులను మరణము నుండి తప్పించ గల వెలుగై ఉండెను. ఇట్టి పవిత్ర జననమైన క్రీస్తుకు కన్యక గర్భము ఒక సంకేతము. అయినను, మనుష్యులకు ఆత్మానుసార జీవనమందు  విశ్వాసము కొరకు,  క్రీస్తుకు కూడా బాప్తిస్మము యివ్వబడెను.

    ఈ విధముగా, ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా తన కార్యక్రమమును ప్రారంభించుటకు సామాన్యుని వలె బాప్తిస్మము నొందెను.

రక్షణ : ఆదాము సంతానములైన వారు అన్యజనులు, అవిశ్వాసులు, విశ్వాసులు మొదలుగా గలరు. వారికి కలిగిన మరణము నుండియు మరియు వారి మంచి చెడు క్రియలకు తగిన ఫలితమును అనుభవించ వలసిన తీర్పు నుండియు వారు రక్షణ నొందుటకు యేసుక్రీస్తు దిగి వచ్చెను. తానే మార్గమై ఆయనను సాదృశ్యపరచుకొనుచు, మనలను ఆయనతో ఐక్యత పరచుకొనమని బోధించెను. ప్రేమ మార్గమును చూపెను. జ్ఞానమును ప్రవచింపజేసెను. సిలువపై  క్రీస్తుగా మరణించి, యేసుగా పునరుత్థానమైన విధమును గ్రహించి మనలను అట్లు ఐక్యత పరచుకొనమనెను.

    శరీరానుసారులు ఆత్మానుసార జీవితమునకు మారవలెనని బోధించి, ఆత్మయే నడిపించుచున్నదన్న విశ్వాసము నొందమనెను. ఆ విశ్వాసము హృదయపూర్వకము కావలెనని ప్రబోధ చేసెను.

క్రీస్తు : ఆత్మానుసార జీవనమునకు ఫలితము క్రీస్తుగా మారుట. క్రీస్తుగా మారిన వారికి ధర్మశాస్త్రము వర్తించదు. ఎందుకనగా ''విశ్వసించు ప్రతివానికి నీతి (దైవనీతి) కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు'' (రోమా 10:4). క్రీస్తైన వారు మరణమునకు తీర్పుతీర్చబడరు మరియు క్రీస్తుయేసు లోనికి ప్రవేశింతురు. ప్రభువైన యేసు అట్టివారిని తనలో చేర్చుకొనును.

క్రీస్తుయేసు - యేసుక్రీస్తు : సాధన చేత క్రీసుయేసుగా నున్న వారు యేసునందు చేర్చుకొన బడగా, క్రీస్తుయేసే యేసుక్రీస్తని ఒకే ఒక్క ఐక్యత స్థితిని కలిగియుందురు.

పరిశుద్ధాత్మ : యెహోవా పరిశుద్ధాత్మ. యేసు ప్రభువునకును, తండ్రికిని బేధము లేనందు వలన యేసు కూడా పరిశుద్ధాత్మయే.  సాధకుడు యేసునందు ఐక్యత స్థితిని పొందుట వలన, అతడు కూడా పరిశుద్ధాత్మయే. ఈ విధముగా తండ్రియు, కుమారుడును, సాధకుడును పరిశుద్ధాత్మగా ఒక్కటే. దీనిని త్రిత్వమందురు.

పరలోకరాజ్యము : పరలోక రాజ్యనివాసమనగా యెహోవా యొక్క ఆదిమూల స్థితి, యేసు ద్వారా తండ్రి స్థితిని పొందిన సాధకుడు పరిశుద్ధాత్మగా సంచకరువు ముద్ర నొందును. యేసు రెండవ రాకడ భూమిపైగాక సాధకుని హృదయములో జరుగును.  సంచరువు ముద్రనొందిన వారికి పరలోక రాజ్యనివాసము శాశ్వతమగును.

బాల యేసు :       క్రీస్తు పశువుల పాకలో జన్మించెను. పాక అనగా శరీరము. పశువులు అనగా తమోగుణము, రజోగుణము, సత్వగుణము అను మూడు గుణములు. పాకలోని పరిసరములు మలమూత్రములతో కూడినదియు, మేయ వలసిన గడ్డి, త్రొక్కివేసిన గడ్డితో కూడి యుండును. అటులనే ఈ పాక అను శరీరమందు కూడా తినుచున్న ఆహారము, జీర్ణమైన ఆహారము, మల మూత్రములు, రక్తమాంసములు, ఎముక మూలిగలు, శుక్ల శోణితములు మొదలగునవి ఉండును. ఈ శరీరమునకు ఆధారమైన జీవము ఆత్మకు స్ధానము. అనగా భ్రూమధ్యము లేక భ్రుకుటి. అక్కడ నుండి, ఈ శరీరమునకు కావలసిన చైతన్యమయిన వెలుగును, అన్ని అవయవములకును ఇంద్రియములకును హృదయస్ధానము నుంచి అందించ బడుచున్నది. ఈ వెలుగే బాలయేసు. ఈ బాలయేసు జన్మించడమనగా పరిశుద్థాత్మ శరీరమును ధరించి జీవుల రక్షణ, మార్గదర్శమునకై క్రీస్తుగా జననము. మానవులలో క్రీస్తు జననమనగా నూతన జన్మ. ఇదియే ఆత్మానుసారుల లక్ష్యము. ఈ లక్ష్యమునకు, అనగా బాలయేసు జననమునకు త్రోవ చూపు నక్షత్రము, ఆత్మానుసారులకు మార్గమై, వెలుగై ఉన్నది.  ఇట్లు స్వయం ప్రకాశము అందరి యందు వ్యాపకముగా సమిష్టిని రక్షించు యేసై ఉన్నది. క్రీస్తు యేసునందు లేపబడిన సాధకులు ప్రభువైన యేసు సాదృశ్యముగా పరిచర్యను చేయుచు యేసు వలన ఈ వెలుగును ఏడు దీపముల ద్వారా ఏడుస్థానములందలి వెలుగును గుర్తింప జేయుచు, యేడు అజ్ఞాన ఆవరణములను దాటించును. ఏడు బూరల ధ్వనిని గుర్తిరచుచు యదార్ధమైన సత్యమును చూపించును. పరలోక సామ్రాజ్యమునందు యెహోవా లేక తండ్రి స్థితియందు ఉదయించిన యేసుగా,అనగా కడపటివాడుగా, అనగా ఒకే జన్మ, ఒకే మరణముగా సుస్థిర స్ధానము నందును. అనాహత శబ్ధమైన దేవుని వాక్యమును చేర్చును. అనగా ఏడు జ్ఞాన భూమికలను దాటించును. ఈ సాధనా ప్రయాణమునకు వెలుగు నిచ్చునది భ్రుృకుటి వద్ద సమీకరించ బడిన పరిశుద్థాత్మనుండి వ్యాపించిన ప్రకాశము. అది పశువుల పాకలో జన్మించిన బాల యేసుగా పిలువ బడుచు పూజింపబడుచున్నది.

    జ్ఞానులైన వారు ఒంటెను వాహనముగా చేసికొని పరలోకమును స్ధిరపరచెడి నక్షత్రము చూపించిన మార్గములో ప్రయాణము చేసిరి. చివరకు పశువుల పాకలో జన్మించిన క్రీస్తును దర్శించిరి. అనగా ఏడవ జ్ఞాన భూమిక దాటుచున్న సాధకులు వారియొక్క భ్రుకుటి స్ధానమందు బాల యేసును దర్శించిరి. ఒంటె వాహనమనగా ఒంటె వలె పై చూపుతో పరలోకమనెడి దైవమును దర్శించుట. ఒంటె వలె ఎండ వానలను, ఉష్ణ శీతలములను ఓర్చుకొనుటయు మరియు ఎన్ని దినములకైనను ఆకలి దప్పికలులేక జీవించగలుగుట. సాధకులు ఒంటె వలె, సర్వకాల సర్వావస్థల యందు శరీర, లోక విషయములను విస్మరించుచు, ఓర్చుకొనుచు పరిశుద్థాత్మ అనెడు లక్ష్యమును చేరుట యందు మాత్రమే ధ్యాస యుంచుకొందురు. అందువలన సత్యమైన నేను అనెడు వెలుగు అయిన చూపు (మార్గము) ద్వారా లోకమను ఎడారిని (జీవ భావమును) దాటి ఒయాసిస్సు వంటి నిత్యజీవమును జేరి ఈ జ్ఞానులు అనుభవపూర్వకముగా వారి యందే దర్శించిరి. జీవజలముతో సమానమైన బాలయేసు దర్శనముతో  సంతుష్టిచెందిరి. అనేక కానుకలు సమర్పించిరి, అనగా వారి అజ్ఞాన సంబంధమైన దాని నుండి సంపూర్ణముగా విడుదల పొందిరి.

                                              ఆమెన్‌!



             అనుభందము

           భక్తి టి.వి ఛానల్‌ నందు 13.02.2008 మధ్యాహ్నము బైబిల్‌ వాక్యములు వివరించబడినది. మంచి వాక్యములే తెలుపబడినవి. '' ఒక చెంప మీద కొట్టిన రెండవ చెంప చూపించ వలెను.'' అని సెలవిచ్చిరి. సామాన్య జనులకు అంతటి ఓర్పు కలుగుటకు ఏమి చేయవలెనో, దానిని కూడా వివరించినచో బాగుండెడిదని ఆలోచన మాకు కల్గినది. ఈ ఆలోచన నిద్రపోనీయక, అర్ధ రాత్రి లేచి కూర్చునేటట్లు చేసినది నూతన నిబంధన గ్రంధమును పరిశీలించి, ప్రభువు యిచ్చిన స్ఫూర్తి తో మీకు తెలియజేయు వాక్యములు ఎంచుకొనిన తరువాతగాని శాంతి నొందలేదు. మరునాడు యీ వివరణను తయారు చేయుట జరిగినది.

          ఈ లోకములో నిజమైన క్రీస్తు గా నున్న వారు అరుదు. దేవుని విషయములో అన్యజనులుగా నున్నవారే ఎక్కువ. మతావలంబకులు సంఖ్యలో ఎక్కువైననూ విశ్వాసములో తక్కువే. వీరు శరీరానుసారమే జీవించుచున్నారు. క్రమముగా వీరినడతను మార్చనిదే వీరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపు ఓర్పు, ధైర్యము పొంద జాలరు. విశ్వాసులు కానంత వరకు వీరు అన్యజనులే.

          అన్యజనులనగా '' జారత్వము, అపవిత్రత, లోభత్వము కలిగినవారు. కృతజ్ఞతా వచనములు ఉచ్ఛరించనివారు. పోకిరి మాటలు , సరసోక్తులు ఉచ్ఛరించువారు. తగవు, వ్యభిచారము, విగ్రహారాధన చేయువారు '' ( ఎఫెసీ 5.38) జారత్వమనగా మంచితనము నుండియు దేవుని చిత్త ప్రకారము నడచుకొనుట నుండియు చెడువైపుకు జారిపోయినవారు. అపవిత్రత అనగా దేవునికి వ్యతిరేకముగా సైతాను సంబంధముగా నుండుట. లోభత్వమనగా తనకు కలిగిన దానిని ఇతరుల మేలుకొరకు ఉపయోగించని మనస్సు కలవారు, వీరు శరీరేచ్ఛతో, పాపేచ్చతో స్వార్ధపరులై యుందురు.

           '' అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడినవారు, నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే మోహము, కాముకత్వమునకు అప్పగించుకొనువారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించి అజ్ఞానము వలన (దేవుని) మరచిన వారైయున్నారు. (ఎఫెసీ 4. 18-24)

         మోహమనగా మూఢత్వము, సోమరితనము. కాముకత్వము అనగా కోరికలను పెంచుకొనుచు,  తృప్తి లేక అశాంతితో జీవించుట. వీరు మూఢ విశ్వాసులై యుండి, స్వార్ధము, దురాశ వలన వారి శరీర సుఖములకై ప్రయాస పడుచుందురు. వీరు పూర్తిగా శరీరానుసారులే.

          ''శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.'' (యోహాను 3. 6-8 )  కనుక శరీర మూలముగా జన్మించిన వారందరు క్రొత్తగా జన్మించవలెను మరియు ఆ దినము నుండి ఆత్మానుసారముగా జీవించవలెను.

           ''శరీరానుసారులు శరీర విషయములు మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మవిషయము మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై యున్నది.'' (రోమా 8. 5-14 )

             ఈ వాక్యముల ద్వారా శరీరానుసారుడు ఆత్మానుసారుడి గా మారవలసి యున్నది. నిత్య జీవము లక్ష్యము కావలెను. ''తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తు వాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంటను కోయును.''       (గలతీ 6.7,8 )

                                                                              



 



  క్షయము అనగా క్షీణించి నశింపజేయు మరణమునకు తీర్పు. అక్షయ మనగా దేవుని ఆత్మచే ధరింపబడు మనుష్యుని ఆత్మ. శరీరము సత్యమనుకొనినచో ఈ ఆత్మ 'డేరా' వంటి శరీరమను వస్త్రమును ధరించుకొనును. శరీరము నశించును కనుక అది క్షయము. ఆత్మయే నడిపించుచున్నదని శరీర భావన విడచినచో ఆత్మ శరీరమను వస్త్రమును విడచి దిగంబర ఆత్మయగును. వెనువెంటనే ఈ దిగంబరాత్మ దేవుని ఆత్మను ధరించు కొనును. అప్పుడది పరిశుద్ధాత్మ యగును. అపుడు ఈ ఆత్మ అక్షయమైన నిత్య జీవముగా నుండును.

      శరీరము మానవ నిర్మిత గుడారము. ఆత్మ దేవునిచే నిర్మించబడిన శాశ్వత నివాసము. భూమి మీద '' మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయిననూ (నరుని) చేత పని కాక దేవుని చేత కట్ట బడినదియు, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. (2 కొరంథీ 5.1 )

     '' పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై (దిగంబరాత్మపై) ధరించుకొన అపేక్షించుచు దీనిలో (శరీరములో) మూల్గు చున్నాము.'' ( 2 కొరంథీ 5.2 )

       శరీర మనగా బాహ్య పురుషుడు, మనుష్యాత్మ అనగా ఆంతర్యపురుషుడు.

 ''బాహ్యపురుషుడు కృశించుచున్ననూ, ఆంతర్యపురుషుడు దినదినమూ నూతన పరచబడుచున్నాడు.''

                                                                                   (2 కొరంథీ 4.16)

     బాహ్యపురుషుడుగా వ్యవహరించుచున్న శరీరము రక్తమాంసములతోనూ, ఎముక మూలిగలతోనూ   నిర్మించబడియున్నది. ఇది మనుష్యుని చేతి పనిగానే నిర్మితమైనది.

      ఇది పుట్టినట్లు కనబడి, పెరిగి, కృశించి, నశించుచున్నది. అందువలన ఇది అనిత్యము, క్షయము.    

 అటులనే ప్రాణమును పోవును. ఇది కూడా అనిత్యమే కాని ఆంతర్యపురుషునిగా నున్న ఆత్మ   అక్షయము, నిత్యము. ఇది మార్పు చెందక నిత్య నూతనముగా నుండును. ఇట్టి నిత్య జీవమును పొందవలెననిన శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జీవించవలెను.

       బాహ్యపురుషుడు అనబడు యీ శరీరము, తన యింద్రియముల ద్వారా మంచి చెడు పనులను చేయుచూ, తగిన ఫలితములను పొందుచున్నది మరియు మరణము నకు తీర్పు తెచ్చుకొనుచున్నది. ఆంతర్య పురుషుడు ఎప్పుడును మేలు క్రియలను చేయమనియే ప్రేరేపించును. కీడు చేయవద్దని అనుకొనును కానీ, స్వార్ధముతో మేలు క్రియలు చేయక చేయవద్దనుకొనిన కీడునే చేయునది మనలోనే నివశించు పాపము. ఆంతర్యపురుషుని మాట విననిదేదో మనలో నివశించుచున్నది. దాని పేరే పాపము.

         '' మేలైనది చేయవలెననెడి కోరిక నాకు కలుగుచున్నదిగాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయ గోరు మేలు చేయక , చేయ గోరని కీడు చేయుచున్నాను. నేను కోరన దానిని చేసిన యెడల దానిని చేయునది నాయందు నివశించు పాపము గాని , నేను కాదు''. ( రోమా 7.17-20 )

         నేను అని పిలువబడువాడు ఆంతర్యపురుషుడు. నేను యిచ్ఛయించనివి చేయువాడు పాపేచ్ఛ వలన, తన ఇంద్రియముల ద్వారా బాహ్యపురుషుడే జరుపుచున్నాడు. '' వేరొక నియమము ( పాప నియమము)నా అవయవములలోనున్నట్లు కనబడుచున్నది. అది నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది.



   మనస్సు విషయములో దైవ నియమము నకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడై యున్నాను''.   (రోమా 7.22-25 )

   కనుక ఆంతర్య పురుషుడైన నేను ఆత్మను, కాని బాహ్య పురుషుడిగా వ్యవహరించుచున్న నేను పాపనియమమునకు లోబడి మంచి చెడు పనులకు తగిన ఫలితములు అనుభవించుచు, మరణమును పొందుచున్నాను. కనుక శరీరము నేను అను భావమునుండి విడుదల పొందవలెను. దీని కొరకు ఆత్మానుసారముగా జీవించవలెను మరియు ఆంతర్య పురుషునిగా అనుభవము పొందవలెను. అప్పుడే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూప గలడు. శరీరానుసారుడు ఆవిధంగా చేయలేడు. ఇట్టి మార్పు కొరకును ఆత్మానుసారమునైన జీవనము కొరకు, క్రీస్తు మార్గమే శరణ్యము. క్రీస్తు యేసు సాదృశ్యమైన మార్గము ప్రేమ మార్గము. దీనికి సహనము, ఓర్పు, ప్రేమ, నిరీక్షణ అవసరము. క్రీస్తు ప్రేమికులు శత్రువునైనను శిక్షించ పూనుకొనినచో వాడు తిరిగి శరీరానుసారమైన క్రియ చేసిన వాడగును. 

       అందువలన ''ఎదిరించు వారు తన మీదకు తామే శిక్ష తెచ్చు కొందురు.''   (రోమా 13.2 )

 అను వాక్యానుసారము మరల మరణమునకు తీర్పు పొందును.

  ''అందువలన ఒకనికొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చియుండవద్దు,   మరి యే ఆజ్ఞ అయినను ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెనను వాక్యములో సంక్షేపముగా యిమిడి ఉన్నది. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. ( రోమా 13.8-10)

 క్రీస్తైన వాడే అట్లు ప్రేమించగలడు. కనుక క్రీస్తుగా మారుటకు యత్నించవలెను. దీనికి మార్గమేమనగా         

  1. ''జీవము గల దేవుని వైపునకు తిరుగవలెను.''  (అపొ.కా 14.15 )

  2. ''విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్ధమైన హృదయముతో మనము దేవుని       

     సన్నిధానమునకు చేరుదము'' ( హెబ్రి 10.22 )

  3. ''మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించ  

      బడినది.''  (రోమా 5. 1-5)

  4. ''నీ దేవుడైన ప్రభువున నీ పూర్ణ హృదయము తోనూ, నీ పూర్ణ మనస్సు తోనూ, నీ పూర్ణశక్తితోనూ,          

     నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను.'' (లూకా 10.27 )

  5.  క్రీస్తు యేసు తాను శిలువ వేయబడి అవమానింపబడి బాధింప బడినప్పుడు క్రీస్తు గా                     

     మరణించబోవు సమయమున, తనను హింసించు వారి కొరకు ఈ లాగున ప్రార్ధించెను.

     '' తండ్రీ.. వీరు ఏమి చేయు చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపు'' మనెను. ( లూకా 6.5 )               

      అట్టి ప్రేమను మనమునూ శత్రువుల యెడ చూపవలెను. అప్పుడు మాత్రమే ఒక చెంప మీద కొట్టిన                         రెండవ చెంప చూప వీలగును.

   '' ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము.''(రోమా 6.5)    

    ఇట్టి ఐక్యతే మన లక్ష్యము. దీనిని సాధించుటయే మన అంతిమ గమ్యము. క్రీస్తు గా మారిన వాడు 

 క్రీస్తు యేసు మార్గమైన ప్రేమ వలన తన యొక్క క్రీస్తు స్థితినే అందరిలోను చూడగలడు. ఎందుకనగా

 ''క్రీస్తే సర్వము మరియు ఆ క్రీస్తే అందరిలోనున్న వాడై యున్నాడు.'' ( కొలస్సి 3.11 )



      అట్టి క్రీస్తు స్థితి అనుభవించు వానికి శరీరానుసారమైన భేదములు కనిపించవు. క్రీస్తు చైతన్యమే సర్వమూ నిండియున్నట్లు కనిపించును. మన వెలుపల, లోపల ఆ క్రీస్తు చైతన్యమే యున్నది.

  '' మనము ఆయన యందు బ్రతుకు చున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము.''

                                                                           (అ.పొ.కా. 17.28 )

  ''ఆయన మనలో ఎవరికిని దూరముగా నున్నవాడు కాదు.'' (అ.పొ.కా. 17.27 )

 వాక్యమే దేవుడు కనుకను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. కనుక ఆయన దేవుని వాక్యముగా నుండెను. ఆ దేవుని వాక్యము సజీవమై ....... ప్రాణములను, కీళ్ళను, మూలిగను విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.'' (హెబ్రి 4.12 )

     ''మనము యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువ బడిన వారము.'' (యూదా 1.1 )

అందువలన మనము క్రీస్తు యేసు నందు ప్రవేశింతుము. ఎందుకనగా

 '' దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరె యెంచు కొనుడి.''

                                                                                    (రోమా 6.11)

అని వాక్యము మరియు '' తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.''

                                                                                    (యోహాను 4.23)

  ''పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా నుండెదరు.  (మత్తయి 5.48)

అందువలన క్రీస్తు యేసు నందు ప్రవేశించినవాడు ఆయన యందు చేర్చుకోబడును.

 '' నేను మిమ్మును చేర్చుకొందును.'' (2 కొరింథి 6.18) అని దేవుని వాక్యము. అట్టివారు ఆయన పునరుత్థానములో ఐక్యత పొందిన వారగుదురు. వారికి సంచకరువు ముద్ర వేయబడి, పరలోక రాజ్యమందు వారికి శాశ్వత నివాసము యేర్పాటు జరుగును.

  లక్ష్యము, గమ్యము మరియు శరీరాత్మల భేదములను వివరించనిదే మనుష్యుడు తాను మారుటకు ప్రయత్నించడు కదా.. అందువలన మీరు ప్రవచించిన వాక్యము పైవిధముగా స్ఫూర్తి నిచ్చుటకు మీ ద్వారా ప్రభువు కృపావరము మాయందు కలిగినది. ఇట్లు సంభవించుట అను అదృష్టమునకు మీరే కారణమైనందున మీకు అనేకముగా వందనములు తెలియజేయుచున్నాము.