13. విశ్వాసము వలన దైవము

13. విశ్వాసము వలన దైవము

     ''నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు నా యందు నీవును (తండ్రి) నీయందు నేనును (క్రీస్తు) ఉన్నలాగున వారును (సాధకులైన నరులు) మన యందు ఏకమై యుండ వలెనని వాక్యము. వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరు ఏకమై యుండ వలెనని ప్రవచనము '' (యోహాను 17:20-21). తండ్రికిని క్రీస్తునకును, క్రీస్తుగా మారిన సాధకునికిని అనుభవములో ఏకత్వమున్నదని ప్రవచనము.

    వాక్యమనగా దేవుని వాక్యము. వాక్యమనగా వెలుగు. వాక్యమనగా జ్ఞానము. జ్ఞానము మొదట దేవుని యొద్ద ఉండెను. అనగా వాక్యము దేవుడైన జ్ఞాన స్వరూపి యొద్ద ఉండెను. ఆయన జ్ఞానమే వాక్యములో వెలుగుగా ప్రకాశించెను. ఆ ప్రకాశమే దేవుడయ్యెను. కనుక జ్ఞాన స్వరూపియైన దేవునికిని, ప్రకాశ స్వరూపమైన దేవునికిని భేదము లేదు. స్వరూపమైన జ్ఞానము అగోచరము. ప్రకాశించు జ్ఞానము అనుభావ్యము. ప్రకాశించు జ్ఞానము వలన సర్వము సృజించ బడెను. సృజించ బడిన దేదియు ప్రకాశము లేకుండా లేదు. చీకటి యున్ననే ప్రకాశము యొక్క ఉనికి గ్రహించ గలము. అంతయూ ప్రకాశమే అయినచో, యిక రెండవది లేనందున, ప్రకాశము యొక్క అస్తిత్వము తెలియ బడదు. లోకమే చీకటి. మనుష్యుల అంత:కరణయే చీకటి. ఈ చీకటి ద్వారానే వెలుగును గ్రహించ వీలగును.

    వెలుగును గూర్చిన జ్ఞానము శుద్ధము. చీకటిని గూర్చిన జ్ఞానము మలినము. మలినమయి నప్పటికిని, అందు జ్ఞానమే మరుగై ఉన్నది. చీకటి అనగా అజ్ఞానము. అజ్ఞానము వలన సృష్టిని అనుభవించు చున్నాము. అయినను సృష్టికి సంబంధించిన అనుభవమునకు మూలము జ్ఞానమే. ఎందుకనగా జ్ఞానమే లేకున్న వెలుగును లేదు, సృష్టియు లేదు. కలిగిన దేదియు దేవుడు లేకుండా లేదు. అందువలన అజ్ఞానమునకు జ్ఞానము ఆధారమై ఉన్నది. అనుభవము అంత:కరణకే గాని హృదయమునకు కాదు. ఎందుకనగా అంత:కరణము ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన సృష్టిని  అనుభవించు చున్నాము గాని హృదయమందు నివశించు  దైవమును అనుభవించ లేకున్నాము. హృదయ ద్వారము తెరవ బడినచో దివ్యానుభూతి కలుగును. అందు కొరకు అంత:కరణమునందలి విషయ మాలిన్యము తొలగ వలెను. మనస్సులో విషయమందలి ఆసక్తిని, దైవము వైపునకు త్రిప్పినచో విషయానుభవమునకు బదులుగా దివ్యానుభూతి కల్గును.   ఈ విధముగా అజ్ఞానమందు ఏ తెలివి యున్నదో అ తెలివిని విషయముల నుండి వేరు చేసినచో, ఆ తెలివియే శుద్ధ తెలివి లేక జ్ఞానము. ఏ జ్ఞానము మన అంత:కరణము ద్వారా  ఇంద్రియములలోనికి ప్రవేశించి, చూచుట, వినుట, తాకుట, రుచి చూచుట, వాసన చూచుట అను ఇంద్రియ జ్ఞానముగా మారుచున్నదో, ఆ ఇంద్రియములు గ్రహించిన విషయ జ్ఞానమును వదలి, వాటికి మూలమైన సాక్షి జ్ఞానమును గ్రహించు చున్నామో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానమే దేవుడు, ప్రజ్ఞానమను వాక్యము దేవుని యొద్ద స్వరూపముగా నుండెను. ఇట్లు తనయందును , ఇతరుల యందును విచారించగా, అన్ని జీవులలోను, పశుపక్ష్యాదులలోను, సర్వకాల సర్వావస్థల యందును ఈ ప్రజ్ఞానమే ఉన్నది. ఇది ఒకే తీరుగా, ఒక్కటిగా నున్నది. జీవులును, జీవుల అనుభవములును ఎన్నైనను, ఈ ప్రజ్ఞానము మాత్రము అన్నింటిలోను వ్యాపకమై, ఒక్కటిగాను, ఒక్కతీరుగాను ఉన్నది.  ఈ ప్రజ్ఞానమే దేవుడు, మొదట వాక్యము దేవుని యొద్ద జ్ఞాన స్వరూపముగా నుండి, పిదప సృష్టి యందు వ్యాపకమైన ప్రజ్ఞానమైనది. ప్రజ్ఞానము దేవుడై, సృష్టిగా మారి, అట్లు మారిన సృష్టిలో, ఎరుకగాను, తెలివిగాను ఉండెను. ఆ తెలివియే శుద్ధముగా నున్నచో జ్ఞానము, మరియు అంత:కరణ మాలిన్యము ద్వారా చూచినప్పుడు కలుగు అనుభవము అజ్ఞానము. శరీరానుసారమైన అనుభవములన్నియు అజ్ఞానము, ఆత్మానుసారమైనప్పుడు, ఇంద్రియములు తమకు తాము గ్రహించి, అనుభవించునది జ్ఞానము కాదని తెలియును. సకల జీవులకును తమ తమ ఇంద్రియములు గ్రహించు తెలివికి మూలమైనది జ్ఞానము.  శరీరానుసారమైన అనుభవములు అసత్యమని యెంచి, వాటి నుండి విడుదల పొందిన వాడు తుదకు ఆత్మానుభవము నొందును , అనగా జ్ఞానమును సంపాదించును, అనగా క్రీస్తుగా మారును.

    క్రీస్తు అయిన వాడు, తాను సర్వ వ్యాపకమైన యేసుక్రీస్తులో నున్నానని యెరుగును. అట్లు యెరిగి ఆయనకును తనకును భేదము లేనట్టి అనుభవమును పొందును. తానే సర్వవ్యాపకమైనట్టి దేవుడని భావించును. ఈ భావనయే తాను దైవ స్వరూపుడనని ఆతనిని స్థిరము చేయును. ఈ విధముగా స్థిరమైన వాడు క్రీస్తు యేసు నందు ప్రవేశించును. క్రీస్తు యేసు నందు ప్రవేశించిన  వాడు యేసు క్రీస్తు నందు చేర్చుకొన బడును. తండ్రి నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు గాను, ప్రజలను తన స్వరూపముగా మారునట్లు అనుగ్రహించు వాడు క్రీస్తు యేసుగాను తెలియ వలెను. ఈ నామములు రెండును తండ్రి నుండి దిగి వచ్చిన స్థితికిని, ఆయన సంపాదించిన ప్రజలను తండ్రి యొద్దకు చేర్చు స్థితికిని సంకేతము. నిజమును పరిశీలించినచో యేసుక్రీస్తే క్రీస్తు యేసు.  క్రీస్తు యేసైన వాడు యేసుక్రీస్తు నందు చేర్చుకొన బడును. వీనికి భేదమేమనగా దేవుడుగా భావించుచు, దేవుడు మనలను చూచునట్లుగా, ఆయన మాటలలో  ఆయన యేసుక్రీస్తు. మనము ఆయన వలెనుండి, ఆయన స్వరూపమైనప్పుడు, మనము దేవుని వైపుకు తిరిగి మాట్లాడినప్పుడు మన స్థితి క్రీస్తు యేసు. రెండు స్థితులుగా చెప్పబడినప్పటికిని, అది ఒక్కటేగాని, అనుభవములో మాత్రమే భేదమున్నది. నేను క్రీస్తు యేసును అను భావములో ''నేను'' ఉన్నది.  ఈ నేను శరీరానుసారమైన అనుభవము నుండి వచ్చు చున్నది. చివరికి ఆత్మానుభవమును పొందినప్పటికిని యీ ''నేను'' సాధకుని విడువ లేదు. ఆయన అనుగ్రహము వలన  యీ ''నేను'' నుండి విమోచన నొందిన వాడు తన క్రీస్తు యేసు అనుభవములో తాను దైవమే యని యెంచు చుండును. దీనినే యేసుక్రీస్తు సాధకుని తనయందు చేర్చుకొనుట యందురు.

    ఇప్పుడు తను వేరు, యేసుక్రీస్తు వేరు అను భావన నశించును మరియు తానును ఆయన స్వరూపమే అను భావన కూడా నశించును. అనగా ఒక్కటైనట్లు తెలియ బడును. ఫలితముగా తానే సర్వవ్యాపకుడైన ప్రభువునని సదా అనుభవములో నుండును. ఇట్టి వానికి ముద్రించ బడు దానిని సంచకరువు అందురు.

    సంచకరువు ముద్ర పొందిన వాడు తనకును తండ్రికిని భేదమును యెరుగ వలెను. అనగా యెహోవా  స్థితికిని , యేసుక్రీస్తు స్థితికిని భేదము తెలియ వలెను. కనుక తండ్రి స్థితిని మరియు తండ్రి లక్షణములను గుర్తెరిగి, తానున్న యేసుక్రీస్తు స్థితితో పోల్చుకొన వలెను. అట్టి పోలికలో భేదము లేదని రెండు స్థితులును ఒక్కటేయని యెరిగి అట్లుండుటయే తండ్రిగా మారుట. ఆ తండ్రి నుండి వచ్చిన యేసుక్రీస్తు అనుభవములో ఇద్దరును ఒక్కటే యని ఉన్నది. కాని సంచకరువు ముద్రించ బడిన వానికి మాత్రము తాను యేసుక్రీస్తు అయినప్పటికిని, తండ్రి వేరనియు, పరలోక  రాజ్యములోనికి తానింక ప్రవేశించలేదని యుండును. ఇట్టి వానికి అభేదత్వమును ఉపదేశించ వలెను.

    యెహోవా జ్ఞాన స్వరూపుడును, సత్య స్వరూపుడనూ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు సత్యమును మార్గమును అయి ఉన్నందున, ఆ స్వరూప స్థితియే వ్యాపక స్థితిగా మారినది. వ్యాపకము కాని జ్ఞానము స్వరూపమనబడును. వ్యాపకమగుచున్న జ్ఞానము ప్రజ్ఞానమనబడును. ఈ ప్రజ్ఞానమే సృష్టియందంతటను వ్యాపకముగా నున్నది.  ఈ ప్రజ్ఞానమే అందరిలోను, అంతట వ్యాపించి, ప్రకాశించుచున్నది. ఈ ప్రజ్ఞానమే ఇంద్రియ వ్యాపారమునకును, శరీరానుభవమునకును ఆధారమై ఉన్నది. అజ్ఞానులు శరీరేంద్రియ అనుభవములు సత్యమని భ్రమింతురు. కాని జ్ఞానులు వాని అనుభవములన్నింటికిని మూలమైన ప్రజ్ఞానమును గుర్తించి, యెరిగి అట్టి అనుభవములో ప్రతిష్ఠితులై ఉందురు. అ విధమైన ప్రతిష్ఠ తనను యేసుక్రీస్తు నందు చేర్చి, సంచకరువు ముద్ర వేయ బడుటకు కారణమై ఉన్నది. తాను ప్రజ్ఞానమై ఉన్నందు వలన, తన వ్యాపక స్థితిని అనుభవించు చుండును. ఈ వ్యాపకమునకు సృష్టి ఆశ్రయమై ఉన్నది. కాని సృష్టికి పూర్వము సత్యము ఉన్నది. ఆ సత్య స్వరూపియే యెహోవా. యెహోవా తండ్రిగా మారినప్పుడు కుమారుని వెలువరించెను. కుమారుడు రాక పూర్వము అతడు తండ్రి కాడు కాని, సత్య స్వరూపిగా శాశ్వతముగా నుండి యుండెను.యెహోవాకును, తండ్రికిని ''ఉనికి''లో భేదము లేకున్నను, కుమారుని పంపుటకు నిశ్చయమైనవానిగాను, కుమారుని ద్వారా సృష్టి యేర్పడుటకును, పరిణామమునకును, అ సృష్టి లయమగుటకును కారణమై ఉండెను. కారణముగా నున్నప్పుడు తండ్రి అని పిలువ బడినప్పటికిని, సృష్టికి పూర్వము ఆయన తండ్రిగా లేడు గాని, సత్యముగా నుండెను.

    యేసుక్రీస్తు నందు సంచకరువుగా ముద్ర నొందిన వాడు తన సర్వ వ్యాపకత్వ అనుభవమును సృష్టి ద్వారా పొందుచున్నాడు. కాని సృష్టి యున్నను, లేకున్నను తాను తండ్రి వలె సత్యమని యెరిగిన వాడు, తన యొక్క ఉనికిని సృష్టి ద్వారానే గాక, తనకు తానే ఉన్నానని యెరుగును. ఎందుకనగా వాక్యమను ప్రజ్ఞానము దేవుడైన యెహోవా వద్ద ఉండెను. తాను వాక్యమై ఉన్నందున, తాను వ్యాపకమైన దేవుడుగా కాక, కారణమందు నిలచి యున్న దేవునిగా యెంచుకొన వలెను. దేవుడైన వాడు ఒక్కడే. కారణమందున్నను లేక కార్యమందున్నను ఒక్కడే. అనగా దేవుని యొద్దనున్న  వాక్యమైనను, దేవుడైన వాక్యమైనను ఒక్కటే. అనగా జ్ఞాన స్వరూపమైనను, ప్రజ్ఞానమైనను ఒక్కటే. సృష్టియందున్న సత్యము ప్రజ్ఞాన మైన వాక్యము. సృష్టికి పూర్వమున్న వాక్యము జ్ఞాన స్వరూపము. కనుక ప్రజ్ఞాన వాక్యముగా నున్న సాధకుడు సృష్టియందున్న తానుగా  గుర్తెరుగుట మాని, తనకు తానుగా సృష్టికి సంబంధములేకనే యున్నాడని గుర్తెరిగి యుండును. అటుల ఉండుటయే స్వరూప జ్ఞానము. ఈ జ్ఞాన స్వరూపము దేవుని యొద్ద వాక్యముగా నుండెను. దేవుని యొద్ద ఉండుటయే పరలోక రాజ్య నివాసము. కనుక ఈ వాక్యమే  స్వరూపమైన పరిశుద్ధాత్మగా తండ్రి యొద్ద ఉన్నది మరియు ప్రజ్ఞామైన పరిశుద్ధాత్మగా యేసువద్ద నున్నది. ఇంను క్రీస్తుగా మారి క్రీస్తు యేసు నందు ప్రవేశించిన ఆత్మ ఈ పరిశుద్ధాత్మ చేతనే అభిషేకించబడి కూడా పరిశుద్ధాత్మగానే యెంచ బడి యున్నది. ఈ విధముగా  ఒక్క పరిశుద్ధాత్మయే స్థితి భేదముచే అనుభవము నందు త్రిత్వమగు చున్నది. ఈ త్రిత్వము అనుభవము పొందిన వారెవరనగా ముందుగా సంచకరువు ముద్రను పొందిన వారే. ఇది వారి హృదయములో యేసు రాకడ వలన జరుగు చున్నది. దీనినే యేసు యొక్క రెండవ రాకడగా చెప్పుచున్నారు. మొదటి రాకడ ప్రభువుగా మన వద్దకు వచ్చినది. ఇప్పుడు సాధకుని స్థితులను బట్టి ఆయన తన హృదయములో ప్రవేశించి, పరలోక రాజ్య నివాసము స్థిరము చేయుటను రెండవ రాకడగా తెలియ వలెను. ఈ రెండవ రాకడకు సిద్థమైన వారికి, అనగా సంచకరువు ముద్ర నొందిన వారి హృదయములో అనుభవమగును. ఈ అనుభవమే యేసు స్థితి. ఇట్లుండటయే ''ఈ ఆత్మ పరిశుద్ధాత్మయే '' అని యుండుట.  యేసు విశ్వశక్తి యందు సాదృశ్య పరచుకొనుటయే యెహోవా స్థితి.

పరిశుద్ధాత్మ ధ్యానము

దేవుడు ఉన్నాడు!

ఆ దేవుడే మానవ రూప ధారియై అవతరించిన యేసు!

చరాచరాత్మకమైన స్థూల, సూక్ష్మ, మానసిక దైవీ సృష్టి అంతా ఆ యేసే!

అట్టి యేసుక్రీస్తు నే నేనుగా కలిగి ఉన్నాను!

యేసు యందు ఉనికి గలిగి యున్నట్టి నాలో అట్టి యేసే అంతా తానై సత్యత్వ స్థితిగాను పరిశుద్ధాత్మగాను నిజ ఉనికి కలిగి ఉన్నాడు ఇదే సత్యము!

ఈ సత్యానుభవ సంబంధమైన ఎరుకను అనుభవింపజేసేదే క్రీస్తు చైతన్యము!

ఆ చైతన్యమే నేను!

అది పరిశుద్ధాత్మయే!

నేను అదే అయి ఉన్నాను!